Breaking News

అనారోగ్యం ఏలూరు ప్రజల్ని వెంటాడి..


 శనివారం సాయంత్రం మొదలు ఇప్పటివరకు అంతుచిక్కని అనారోగ్యం ఏలూరు ప్రజల్ని వెంటాడి.. వేధిస్తున్న సంగతి తెలిసిందే. గుడికి వెళ్లిన వారు.. బంధువుల ఇంట్లో ఉన్నవారు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అప్పటివరకు బాగానే ఉండి.. అప్పటికప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురి కావటం.. మూర్ఛ రావటంతో పాటు.. వాంతులు.. విరోచనాలతో తల్లడిల్లిపోయే వైనం తెలిసిందే. ఏలూరుకు ఏమైందన్న భయాందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ అంతుచిక్కని వ్యాధి సంగతి లెక్క తేల్చేందుకు ఏయిమ్స్ వైద్యులు మొదలు.. పలు టీంలు ఏలూరుకు వచ్చి అక్కడి పరిస్థితులకు కారణం ఏమిటన్న విషయాన్ని లెక్క తేల్చే ప్రయత్నం చేశారు.ఇదిలా ఉంటే.. ఏలూరు దుస్థితికి కారణం నీటి కాలుష్యంగా కొందరు వైద్యులు చెబుతుంటే..

నిఫా వైరస్ కావొచ్చన్న కొత్త కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు డాక్టర్ సమరం. గతంలో కేరళను అతలాకుతలం చేసిన నిఫా వైరస్ మాదిరే ఏలూరులోనూ ఉండి ఉంటుందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పరిశోధనల ద్వారా నిఫా వైరస్ అవునా? కాదా? అన్న విషయాన్ని నిర్దారించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ నిఫా వైరస్ అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే.. ఎయిమ్స్ వైద్యుల వెర్షన్ మరోలా ఉంది. ఏలూరులో ప్రజలు అనారోగ్యానికి గురి కావటం వెనుక భార లోహమైన సీసం.. ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ కక్కర్ వెల్లడించారు.

పాలు.. నీరు కలుషితం కావటంతో అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయన్న ఆయన.. పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలు.. బ్యాటరీల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధితులతో మాట్లాడినప్పుడు చాలామంది తాము వాడిన నీళ్లు బ్లీచింగ్ వాసనతో పాటు రుచిలేనివని చెప్పారు. కొందరు మాత్రం నీటి రంగు మారినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు నీటి కాలుష్యమే ఏలూరు కొంప ముంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరులో సేకరించిన పలు శాంపిల్స్ ను విశ్లేషించిన పలు సంస్థలు (ఐఐసీటీ.. సీఎస్ఐఆర్.. ఎన్జీఆర్ఐ) షాకింగ్ వాస్తవాల్ని వెల్లడించాయి.

నీళ్లలో అధిక మోతాదులో క్లోరైన్.. పాస్పైట్ పెస్టిసైడ్స్ ఉన్నట్లుగా తేల్చారు. ఏలూరు పరిస్థితికి లెడ్.. నికెల్ కారణంగా తేల్చారు. బాధితుల రక్తంలో అధిక మోతాదులో లెడ్ హెవీ మెటల్.. నికెల్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 500లకు పైగా ఆసుపత్రిలో చేరారు. ఇందులో 322 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు ఏలూరులోని ఒకట్రెండు ప్రాంతాలకు పరిమితమైన ఈ మహమ్మారి.. ఇప్పుడు పలుప్రాంతాలకు విస్తరించటం ఆందోళనకు గురి చేస్తోంది.