Breaking News

బీజేపీలో చేరిన విజయశాంతి...


 సినీ గ్లామర్‌తో పొలిటికల్ ఫీల్డ్‌లో దుమ్మురేపిన సినీ నటులు ఎంతో మంది ఉన్నారు. కావాల్సినంత గ్లామర్, ప్రజల్లో ఎంతో గుర్తింపు అన్నీ ఉన్నా... రాములమ్మ మాత్రం ఇప్పటివరకూ రాజకీయాల్లో చెప్పుకోతగ్గ పాత్రను పోషించలేదు. సినిమాల్లో లేడీ బాస్‌గా, లేడీ అమితాబ్‌గా గుర్తింపు ఉన్నా అవేవీ ఆమెకు రాజకీయాల్లో ఇప్పటివరకూ కలిసి రాలేదు. తాజాగా ఢిల్లీలో... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు విజయశాంతి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. విజయశాంతి రాకతో... తెలంగాణలో తమ పార్టీ మరింత పుంజుకుంటుందనే విశ్వాసంతో ఉన్నాయి బీజేపీ శ్రేణులు.

1998లో బీజేపీతోనే విజయశాంతి రాజకీయ ఆరంగేట్రం జరిగింది. తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. కొన్నాళ్లకు దాన్ని టీఆర్ఎస్‌లో కలిపేశారు. టీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నికైన రాములమ్మ... ఆ తర్వాత... టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.

టీఆర్ఎస్‌లో విబేధాలతో... ఈ మాజీ మెదక్ ఎంపీ.... 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఐతే... కాంగ్రెస్ పార్టీలోనూ ఆమె అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ మధ్య బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతో... ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే రాములమ్మ.. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అన్నారు. తద్వారా ఆమె బీజేపీ వైపు వెళ్తూ... టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

GHMC ఎన్నికలతో టీఆర్ఎస్‌కి తామే ప్రత్యర్థులమని క్లారిటీగా తేల్చేసిన బీజేపీ... త్వరలోనే జమిలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దింపేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి బలమైన, సినీ, రాజకీయ ఆకర్షణ ఉన్న నేతల అవసరం ఎంతో ఉంది. GHMC ఎన్నికల్లో తక్కువ టైమ్‌లోనే ఎంతో మంది చోట మోటా నేతలందర్నీ పార్టీలోకి తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పార్టీ... అనూహ్య విజయం సాధించేలా చేశారు. ఇక ఇప్పుడు బీజేపీని పుంజుకునేలా చెయ్యడానికి విజయశాంతి లాంటి నేతల అవసరం ఉంది. అందువల్ల రాములమ్మకు తెలంగాణ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ నేతలు లేరు కాబట్టి... విజయశాంతికి కూడా ఇది బాగా కలిసొచ్చే అంశమే అంటున్నారు విశ్లేషకులు. ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తే... బీజేపీలో ఆమె ఎదిగేందుకు, అలాగే... రాష్ట్రంలో బీజేపీ ఎదిగేలా చేసేందుకు ఈ సమీకరణాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాములమ్మరాకతో... తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగినట్లే.