Breaking News

ఆండ్రాయిడ్‌ ఆటో.. హాయిగా సాగిపో


 కారు కొనడమంటే ఒకప్పుడు గొప్ప. ఇప్పుడు అవసరం. అందులోనూ అన్ని ఫీచర్లు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకొని కొనుగోలు చేస్తున్నారు. కారులో అలసిన మనసుకు హాయినిచ్చేది వినోదం. కాలం మారింది.

కాలంతోపాటు కార్ల ఫీచర్లలో సరికొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఒకప్పుడు పాటలకే పరిమితమైన స్టీరియో సిస్టం ప్రస్తుతం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అవసరమైన సమాచారాన్ని, కావాల్సినంత వినోదాన్ని అందించేందుకు ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సాప్ట్‌వేర్‌ అప్లికేషన్లు ఉండేలా చూసుకుంటున్నారు. కారులో కూర్చొని ఇంటర్‌నెట్‌ సౌకర్యం పొందాలన్నా, చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం కావాలన్నా ఆండ్రాయిడ్‌ ఆటో, ఇటు ఆపిల్‌ ప్లే సాప్ట్‌వేర్‌తో పనిచేసే స్టీరియో డివైజ్‌లకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. వాహనదారుల అభిరుచికి తగినట్లుగానే ఆటోమొబైల్‌ కంపెనీలు టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వీటికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాయి.

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : ఆటోమొబైల్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, టెక్నాలజీ ఉండే వాహనాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. సమాచారం, వినోదాల కలబోత ఉన్న వాటిని ఇష్టపడుతున్నారు. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే...నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వీటికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే కార్లలో రకరకాల ఫీచర్లు ఉంటాయి. మోడల్‌ ఒక్కటే అయినా..అందులో ఉండే ఫీచర్ల కోకొల్లలు. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ పరంగా కొత్త ఫీచర్లు, విభిన్న సదుపాయాలను కార్ల కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆండ్రాయిడ్‌ ఆటో,ఆపిల్‌ కార్‌ప్లే సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌లతో కూడిన స్టీరియో డివైజ్‌లపై మరింత ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్‌నెట్‌తో అనుసంధానం, చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో కావాల్సింది మార్చుకోవడం. మాట్లాడితే స్పందించే ప్రత్యేకత, చేరుకోవాల్సిన గమ్యస్థానం పక్కాగా చేరుకోవాలన్నా ఇప్పుడు కార్ల యజమానులు కోరుకునేది ఆండ్రాయిడ్‌ ఆటోనే. స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఎట్లా ఉండలేమో, నేడు కొత్తగా మార్కెట్లోకి వచ్చే కార్లలో ఆండ్రాయిడ్‌ ఆటో డివైజ్‌ లేని కార్లు ఉండడం లేదు.

రెండింటి మధ్య పోటీ...

దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆటోమొబైల్‌ కంపెనీలు ఉన్నా, ఆయా కంపెనీలు మాత్రం ఆండ్రాయిడ్‌ ఆటో లేదా ఆపిల్‌ ప్లే సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌లతో ఉన్న డివైజ్‌లను తయారు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో తీవ్రంగా పోటీపడుతున్న గూగుల్‌, ఆపిల్‌ కంపెనీలే ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను అందిస్తున్నాయి. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కంపెనీ ఆపిల్‌ ప్లే సాప్ట్‌వేర్‌ అప్లికేషన్లను ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఆటోదే పైచేయిగా ఉంది.

ఆటోమొబైల్‌ రంగానికి హైటెక్‌ హంగు

ఒకప్పుడు కారులో స్టీరియో సిస్టం ఒక చాయిస్‌ ఉండేది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటుపడిన వారంతా ఏరికోరి ఆండ్రాయిడ్‌ ఆటో స్టీరియో డివైజ్‌ ఉండేలా చూసుకుంటున్నారు. ఐటీ దిగ్గజం గూగుల్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించినట్లే..ఆటోమొబైల్‌ రంగంలోని వాహనాలకు అనుకూలంగా ఆండ్రాయిడ్‌ ఆటోను రూపొందించి, ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తోంది. నూతనంగా కార్లు కొనుగోలు చేసేవారు ఆండ్రాయిడ్‌ ఆటో ఫీచరు ఎలా ఉంది ? ఏ వర్షన్‌తో ఆ కారు వస్తుందన్న విషయాలను ఆరా తీసిన తర్వాతే కొనుగోలు చేస్తున్నారు.

ఆండ్రాయిడ్‌ ఆటో ఫీచర్‌ డివైజ్‌ ఉండాల్సిందే

కారు అంటేనే కొత్తకొత్త ఫీచర్లు ఉండాలి. ప్రయాణం ఎంజాయ్‌ చేయాలి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ చాలా అత్యవసరమైంది. అన్ని ఫీచర్లతోపాటు ఆండ్రాయిడ్‌ ఆటో లేదా ఆపిల్‌ ప్లే వంటి ఫీచర్లు స్టీరియో డివైజ్‌ ఉందా అనే విషయానికి ప్రాధాన్యతనిస్తున్నాను. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారంతా ఆండ్రాయిడ్‌ ఆటో అంటే అధికంగా ఇష్టపడుతుంటారు. దీనిక్కారణం తమ స్మార్ట్‌ఫోన్‌తో కారులోని ఆండ్రాయిడ్‌ ఆటో డివైజ్‌తో అనుసంధానం సులభం ఉండడమే. -అరుణ్‌కుమార్‌, కూకట్‌పల్లి