Breaking News

భారత్ బంద్‌కు పలు సంఘాల మద్ధతు...


 కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేర మంగళవారం నాటి భారత్ బంద్ కు పలు సంఘాలు మద్ధతు ప్రకటించాయి. రైతుల భారత్ బంద్ కు పలు కార్మిక సంఘాలు, రవాణ సంఘాలు, న్యాయవాద సంఘాలు మద్ధతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీతోపాటు పలు ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కీలకమైన రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా సాధారణ జన జీవనం స్తంభించి పోయింది. రైతుసంఘాల బంద్ విజయవంతం అయింది. సామాన్య ప్రజలకు సమస్య లేకుండా బంద్ పాటిస్తున్నామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు.

దుకాణదారులు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నుంచి అత్యవసర, అంబులెన్సు, ఆసుపత్రి సేవలను మినహాయించారు.

పంజాబ్, హర్యానాలలో రవాణ ట్రక్ యూనియన్ లు బందుకు మద్ధతు ప్రకటించారు. భారత్ బంద్ సందర్భంగా పాలు, కూరగాయల సరఫరాకు ఆటంకం ఏర్పడింది.బంద్ సందర్భంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మండీలు మూసివేశారు. ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీని మూసి వేశారు. పంజాబ్ రాష్ట్రంలో బంద్ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, బార్ లను మూసివేస్తున్నట్లు ఆయా సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భారత్ బంద్ సందర్భంగా ఉబేర్, ఓలా టాక్సీ సేవలు నిలిచిపోయాయి.