ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు జనసేన మద్దతు
హైదరాబాద్ మహానగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు జనసేన మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం ప్రకటించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బల్దియా ఎన్నికల పోటీ నుంచి తమ అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు ఆయన తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలనుకున్నప్పటికీ కరోనా, అనూహ్యంగా వచ్చిన ఎన్నికల నేపథ్యంలో సాధ్యపడలేదన్నారు.
జీహెచ్ఎంసీతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఉంటుందని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
''ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. జనసేన కార్యకర్తలంతా భాజపా విజయం కోసం పనిచేయాలి. తెలంగాణలో జనసేన, బీజేపీ రోడ్‌మ్యాప్‌ను భవిష్యత్‌లో ప్రకటిస్తాం. ఇప్పటికే నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలి'' అని పవన్‌కల్యాణ్ కోరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం అయ్యామని, ఆయన సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ గెలుపు కోసం జనసేన కార్యకర్తల మద్దతు, ముఖ్యంగా పవన్‌కల్యాణ్ ప్రచారం అవసరమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
దిల్లీలో కాలుష్యం దెబ్బ.. గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న సోనియావిశ్రాంతి నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నాడు గోవా రాజధాని పణజి చేరుకున్నారని.. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉండడంతో సోనియాకు ఛాతీలో విపరీతమైన సమస్య ఏర్పడింది. ఉబ్బస వ్యాధి ఎక్కువై శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది. కొన్నాళ్లుగా ఆమె ఛాతీసమస్యలతో బాధపడుతున్నారు.
వాయుకాలుష్యం వల్ల ఆమె ఇబ్బంది మరింత ఎక్కువైనట్లు గ్రహించిన డాక్టర్లు వెంటనే దిల్లీని వీడి ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో కొన్నాళ్లు గడపాలని సూచించారు. దాంతో ఆమె హుటాహుటి పణచి చేరుకున్నారు.
