పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, జార్జియా, ఫ్లోరిడా ఫలితాలే ప్రధానం
అమెరికా కొత్త అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఐదు రాష్ట్రాలే కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవే పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, జార్జియా, ఫ్లోరిడా. గత ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అంచనాలు తారుమారు కావడమే డెమోక్రాట్లకు అధ్యక్ష పీఠాన్ని దూరం చేసింది. 'బ్లూ వాల్' (డెమోక్రాట్లకు కంచుకోటలుగా భావించే రాష్ట్రాలు) రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలలో గత ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి దానిని పునరావృతం కానీయకూడదని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్ సొంత రాష్ట్రం ఇది. డెమోక్రాట్లకు గతంలో బలమైన పట్టు ఉన్న మూడు రాష్ట్రాల్లో ఇది అతిపెద్దది. 1992లో బిల్‌క్లింటన్ నుంచి 2012లో ఒబామా రెండోసారి అధ్యక్షుడు అయ్యేంతవరకు ఈ రాష్ట్రంలో డెమోక్రాట్లే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2016లో ఫలితం తారుమారైంది. రూరల్, కన్జర్వేటివ్ ప్రాంతాల్లో గణనీయ ఓట్లను సాధించడంతోపాటు డెమోక్రాట్ల నుంచి శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ ఓటర్లను తనవైపునకు తిప్పుకోవడంతో ట్రంప్ విజయం సాధించారు.
మిషిగన్
ఈ రాష్ట్రంలోనూ 1992 నుంచి 2012 వరకు డెమోక్రాట్లే విజ యం సాధిస్తూ వచ్చారు. 2016లో మాత్రం ట్రంప్ విజయఢంకా మోగించారు. అయితే ఈసారి ఇది తిరిగి డెమోక్రాట్ల వశం కానుందని పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ ట్రంప్ కంటే బిడెన్ ఏడు పాయింట్ల ముందంజలో ఉన్నారు.
విస్కాన్సిన్
1984 ఎన్నికల తర్వాత ఇక్కడ తొలిసారి గెలుపొందిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపే. డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తున్న శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ట్రంప్ విజయం సాధించారు. అయితే ఈసారి బిడెన్ ఇక్కడ ఆరు పాయింట్లు ముందంజలో ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.
జార్జియా
1992లో బిల్ క్లింటన్ విజయం సాధించేంతవరకు ఈ రాష్ట్రంలో డెమోక్రాట్ అభ్యర్థులెవరూ గెలుపొందలేదు. రిపబ్లికన్లదే ఆధిపత్యం ఉండేది. అయితే క్రమంగా ఇక్కడ గ్రాండ్ ఓల్డ్ పార్టీ(రిపబ్లికన్) ప్రాబల్యం తగ్గింది. ఈసారి పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బిడెన్ కేవలం 0.8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.
ఫ్లోరిడా
జనాభా పరంగా మూడో అతిపెద్ద రాష్ట్రం ఇది. 1996 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ అధ్యక్షులను నిర్ణయించడంలో ఈ రాష్ట్రం కీలకంగా నిలుస్తున్నది. ముఖ్యంగా 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా ఫలితమే అధ్యక్షుడిని నిర్ణయించింది. బ్యాలెట్లలో స్వల్ప తేడా మాత్రమే ఉండడంతో సుప్రీంకోర్టు తీర్పుతో బుష్ అధ్యక్షుడయ్యారు. ఈసారి ఇక్కడ బిడెన్ 1.2 పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
