ఏపీ ఇంటర్ బోర్డు కార్మదర్శి కీలక ప్రకటన
ఏపీలో ఇంటర్ అడ్మిషన్లపై బోర్డు కార్యదర్శి వీ.రామకృష్ణ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టెన్త్ పాసైన ప్రతీ ఒక్కరికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీటు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో అడ్మిషన్ల గురించి మార్చిలోనే అన్ని కాలేజీలకు సర్క్యులర్ ఇచ్చినట్లు చెప్పారు. బోర్డు వెబ్సైట్లో యూజర్ మాన్యువల్ విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు వారి ఇన్టేక్ వివరాలు నమోదు చేయలేదన్నారు. దీంతో వాటి పేర్లు ఆన్లైన్లో కనిపించడం లేదని రామకృష్ణ చెప్పారు.
ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇంటర్ బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల ప్రకారం వాటిని ఆన్లైన్లో ఉంచామన్నారు. ఫైర్ ఎన్ఓసీ లేని కాలేజీలకు 60 రోజుల గడువుతో అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు. వ్యాపార భవన సముదాయాలు, రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న కాలేజీలకు 2020-21 విద్యాసంవత్సరానికి మాత్రం అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరు చేసిన 208 కళాశాలతో కలిపి 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.రాష్ట్రంలో విద్యార్థులకు సీట్ల కొరత లేదని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో రెగ్యులర్, కాంట్రాక్టు ఫ్యాకల్టీ లేని చోట్ల గంటల ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు అనుమతిస్తూ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పారితోషకాన్ని గంటకు రూ.150, నెలకు సబ్జెక్టుకు రూ.10వేలు మించకుండా చూడాలని సూచించారు.
