తప్పు ఒప్పుకున్న ట్విట్టర్..
చైనా భూభాగంలో లద్దాఖ్‌ను చూపడం తమ తప్పేనని సామాజిక మాధ్యమం ట్విట్టర్ అంగీకరించింది. తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ రాతపూర్వకంగా పార్లమెంటరీ కమిటీకి క్షమాపణలు తెలిపినట్లు, ఈనెలాఖరుకు ఆ తప్పుని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు.
లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌లో చూపించిన నేపథ్యంలో ట్విట్టర్‌కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరపర్చినందుకు మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ట్విట్టర్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులో తెలిపింది.
అందులో భాగంగా ట్విట్టర్ తప్పు ఒప్పుకుంది. భారత పటాన్ని జియో ట్యాగింగ్‌లో తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకంతో కూడిన అఫిడవిట్ పార్లమెంటు కమిటీకి సమర్పించారు. ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు క్షమాపణ కోరారు. భారత ప్రజల విశ్వాసాలను గాయపర్చినందుకు వారు క్షమాపణ కోరారని, నవంబర్ 30 లోపు ఆ తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు మీనాక్షి లేఖి తెలిపారు.
