దొంగ మాప్ ప్రదర్శించిన పాక్ : భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశంలో పాకిస్థాన్ కల్పిత మ్యాప్‌ను చూపడంతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత దేశంలోని భూభాగాలను పాకిస్థాన్‌కు చెందినవిగా చూపిస్తున్న కల్పిత మ్యాపును పాకిస్థాన్ ప్రతినిథి ప్రదర్శించడంతో నిరసన వ్యక్తం చేస్తూ భారత దేశ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సదస్సు రష్యా అధ్యక్షతన జరిగింది.
భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆతిథ్య దేశం ఇచ్చిన సూచనల పట్ల పాకిస్థాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. సమావేశ నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. ఆతిథ్య దేశంతో సంప్రదించిన తర్వాత భారత దేశం నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.
ఓ ప్రశ్నకు సమాధానంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఊహించినట్లుగానే ఈ సమావేశంలో తప్పుదోవపట్టించే అభిప్రాయాన్ని పాకిస్థాన్ వ్యక్తం చేసిందన్నారు.
పాకిస్థాన్ చర్య ఎస్సీఓ చార్టర్‌ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎస్సీఓ సభ్య దేశాల సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతలను కాపాడటం కోసం ఏర్పరచుకున్న నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపాయి.
రష్యన్ ఫెడరేషన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికొలాయ్ పట్రుషెవ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ చర్యలను రష్యా సమర్థించబోదని చెప్పారు. ఈ రెచ్చగొట్టే చర్య ఎస్సీవోలో భారత దేశ భాగస్వామ్యంపై ఎటువంటి ప్రభావం చూపబోదని ఆశిస్తున్నట్లు తెలిపారు.
