'కొవాక్స్' కార్యక్రమంలో చేరాలని ధనిక దేశాలను కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచదేశాలన్నింటికీ టీకాను సరళంగా, సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన 'కొవాక్స్' కార్యక్రమంలో చేరాలని ధనిక దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కోరారు. యూరప్‌తో ఏర్పాటు చేసిన డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'మహమ్మారిని ఎదుర్కోవటానికి టీకాలు, చికిత్సా విధానాల అభివృద్ధి కోసం డబ్ల్యూహెచ్‌వో ఏసీటీ కార్యక్రమంలో భాగమైన 'కొవాక్స్' సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 92 తక్కువ ఆదాయ దేశాలు సహాయం కోరుతున్నాయి. 80 అధిక ఆదాయ దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. చాలా దేశాలు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ వారం చివరిలోగా అన్ని దేశాలూ చేరాలి.' అని అన్నారు. అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందకపోతే వైరస్ విజృంభణ అలాగే సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
