Breaking News

వందలాది జింకలు ఏమయ్యాయి?


 పెద్ద పులుల ఆహారం కోసం వదిలిన వందలాది జింకలు ఏమయ్యాయి? నిజంగానే పెద్దపులులకు ఆహారమయ్యాయా? వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాయా? అనే విషయమై అటవీశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. అటవీ సమీప గ్రామాల్లోని పశువులు పులి వేటకు బలవుతుండటం, ఇద్దరు మృత్యువాత పడటం తదితర పరిణామాల నేపథ్యంలో జింకల వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో కవ్వాల్‌ అభయారణ్యం విస్తరించి ఉన్నది. ఇక్కడికి 2015 నుంచి పెద్దపులుల వలస పెరిగింది. వాటికి ఆహారం కోసం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌, వనస్థలిపురంలోని మహావీర్‌ హరిణవనస్థలి జాతీయ పార్కు, శామీర్‌పేట పార్కు నుంచి దాదాపు 400 జింకలను గత ఏడాది కాలంలో దశలవారీగా తరలించారు.

వాటిలో చుక్కల జింకలు, దుప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే కవ్వాల్‌లో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న వేటగాళ్లు కుక్కల సహాయంతో జింకలు, దుప్పులను వేటాడుతున్నట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు.

కవ్వాల్‌ అభయారణ్యంలోకి పెద్ద పులుల వలస పెరుగడంతో కొత్త సవాళ్లు మొదలయ్యాయి. వాటి ఆకలి తీర్చే వన్యప్రాణుల (ప్రే యానిమల్‌) సంతతి పెరగకపోవడం సమస్యగా మారింది. ఇక్కడికి వచ్చిన పెద్ద పులులు అటవీ ప్రాంతంలోని నీల్గాయ్‌, అడవి పందులు, జింకలతో సహా మేతకు వచ్చిన పశువులపైనా దాడి చేస్తున్నాయి.

దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మరో 200 దుప్పులను ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు.