పేటీఎం.. వ్యాపారులకు గుడ్ న్యూస్
ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం.. వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యాపారులు చేసే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను రద్దు చేసింది. ఇకపై పేటీఎం వ్యాలెట్, యూపీఐ యాప్స్, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని పేర్కొంది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది.
పేటీఎం ఆల్ఇన్ వన్ క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీవోఎస్ వాడుతున్న సుమారు 1.7కోట్ల మంది వ్యాపారులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుందని పేటీఎం తెలిపింది. అంతేకాకుండా ఇది డిజిటల్ పేమెంట్స్ దిశగా వ్యాపారులను ప్రోత్సహించడమే కాకుండా, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడానికి తోడ్పడుతుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ ఆదిత్య తెలిపారు.
