కెన్యాలో ఎయిర్టెల్ హైస్పీడ్ 4జీ.. 5జీ కూడా...
మన దేశానికి చెందిన భారతీ ఎయిర్టెల్ ఇప్పుడు ఆఫ్రికాదేశాల్లో విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ కొత్తగా హైస్పీడ్ సేవలనూ అక్కడ పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా కెన్యాలో హై-స్పీడ్ 4జీతో నెట్వర్క్ ఆధునికీకరణతో పాటు 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకూ సన్నాహాలు చేస్తోంది. దీనకి సంబంధించి ఎయిర్టెల్, నోకియా మధ్య 3 ఏళ్ల ఒప్పందం కుదిరింది.
కెన్యాలోని ఎయిర్టెల్ వినియోగదారులు ఎటువంటి ఆటంకాలూ లేకుండా 5జీలోకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు నోకియా నెట్వర్క్ సహకరించనుంది. దీనికోసం అవసరమైన మౌలిక సదపాయాలనూ కల్పించనుంది. అప్‌గ్రేడ్ అయిన కొత్త వినియోగదారులకు అత్యంత వేగవంతమైన నెట్వర్క్ సేవలను అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది.
ఎయిర్టెల్ విస్తరణపై కెన్యాలోని సంస్థ సీఈఓ పీడీ శర్మ స్పందించారు. తమ డేటా నెట్వర్క్ ఆధునీకీకరణతో పాటు కవరేజీని పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల తమ వినియోగదారులకు మెరుగైన, హై-స్పీడ్ డేటా సేవలను అందించగలుగుతామని చెప్పారు. బ్రౌజింగ్, డేటా యూసేజ్లను కూడా వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో తమతో నోకియా కలిసి రావడం ఆనందంగా ఉందని, నోకియా టెక్నాలజీ పోర్ట్‌ఫోలియో తమ నెట్వర్క్ నాణ్యతను గణనీయంగా పెంచుతుందని చెప్పారు. భవిష్యత్తులో 5జీ సేవలకు వెళ్లడానికి కూడా అనుమతిస్తుందని పీడీ శర్మ పేర్కొన్నారు.
