విజయంతో ఢిల్లీ .. ఓడినా బెంగళూరు ముందంజ
గెలుపు, ఓటములతో పనిలేకుండా ఢిల్లీ, బెంగళూరు జట్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో రహానె, ధవన్ రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో నేరుగా రెండో స్థానం దక్కించుకుంది. ఇక కోహ్లీసేన ఓడినప్పటికీ ఢిల్లీని 17.3 ఓవర్లకు మించి ఆడేలా చేయడంతో కోల్కతాకన్నా మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ముందుకెళ్లడం విశేషం.
విజయంతో ఢిల్లీ .. ఓడినా బెంగళూరు ముందంజ
అబుదాబి: వరుస అపజయాలకు చెక్ పెడుతూ చివరిదైన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తూ బెంగళూరును 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది.
రహానె, ధవన్ భాగస్వామ్యం: స్వల్ప ఛేదనే అయినప్పటికీ ఢిల్లీ ఇన్నింగ్స్ దాదాపు చివరి వరకు సాగింది. రహానె, ధవన్ అర్ధసెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆరంభంలో తొలి పది బంతుల్లోనే నాలుగు ఫోర్లతో డీసీ 19 పరుగులు సాధించింది. కానీ రెండో ఓవర్లో సిరాజ్ ఇన్‌స్వింగర్‌కు పృథ్వీ షా (9) బౌల్డయ్యాడు. అయినా ఒత్తిడి లేకుండా ధవన్, రహానె జోడీ బెంగళూరు బౌలర్లను ఎదుర్కొంది. చక్కటి సమన్వయంతో వీలు చిక్కినప్పుడల్లా వీరు బౌండరీలతో స్కోరును పెంచారు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 53 పరుగులు చేసింది. రహానె చక్కటి ఫుట్‌వర్క్‌ను కనబరుస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడగా ధవన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే 13వ ఓవర్లో అతడిని స్పిన్నర్ నదీమ్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానె 37 బంతుల్లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో కెప్టెన్ అయ్యర్ (7), రహానె చెత్త షాట్లతో వికెట్లను కోల్పోయారు. అప్పటికి 17 బంతుల్లో 17 రన్స్ అవసరం కాగా ఢిల్లీ మరో ఓవర్ ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.
