కీలక ఇన్నింగ్స్ లో చెలరేగిన రాయుడు, వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్ వాట్సన్(42: 38 బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు), అంబటి రాయుడు(41: 34 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో చెన్నై పోరాడే స్కోరు సాధించింది. ఓపెనర్ డుప్లెసిస్(0) మినహా శామ్ కరన్(31: 21 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ(21: 13 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్), జడేజా(25 నాటౌట్:10 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయుడు, వాట్సన్ జోడీ 60కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ(2/19), ఖలీల్ అహ్మద్(2/45), నటరాజన్(2/41) తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.
చెన్నై ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసింది. డుప్లెసిస్‌కు జోడీగా శామ్ కరన్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్(0) హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్లో వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ అవకాశాన్ని కరన్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో శామ్ కరన్(31) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 22 పరుగులు సాధించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న కరన్..సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి చెన్నై 44/2తో నిలిచింది. ఈ దశలో వాట్సన్, రాయుడు బాధ్యతాయుతంగా ఆడారు.
వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు బాదడంతో పరుగుల వేగం ఎక్కడా తగ్గలేదు. అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరింది. ఖలీల్ వేసిన 16వ ఓవర్లో రాయుడు..నటరాజన్ వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ వెనుదిరిగారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీ పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ ఊపీరిపీల్చుకుంది. ఇన్నింగ్స్ ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోనీ, జడేజా తమదైన శైలిలో రెచ్చిపోవడంతో స్కోరు 160 దాటింది.
