చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, అటు అభిమానులకు శుభవార్త.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, అటు అభిమానులకు శుభవార్త. గతవారం కరోనా బారిన పడిన ఆ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ ఈ తీపి కబురు చెప్పినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. ఒకవేళ అదే నిజమైతే ధోనీసేన త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టవచ్చు. పది రోజుల క్రితమే అన్ని జట్లూ దుబాయ్, అబుదాబికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై కూడా ఆగస్టు 21న దుబాయ్‌కి చేరుకుంది.
తొలుత అక్కడ ఆరు రోజులు క్వారంటైన్లో ఉన్న ఆ జట్టుకు పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పేసర్ దీపక్ చాహర్, బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ నిర్ధరణ అయినట్లు తెలిసింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లంతా మరో వారం రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించిన తొలి పరీక్షలో అందరికీ నెగిటివ్‌గా వచ్చిందని విశ్వనాథన్ వెల్లడించారు. సెప్టెంబర్ 3న మరోసారి నిర్ధరణ పరీక్షలు చేస్తారని, అందులో కూడా అందరికీ నెగిటివ్‌గా వస్తే తమ జట్టు సెప్టెంబర్ 5 నుంచే ప్రాక్టీస్ మొదలుపెడుతుందని ఆయన అన్నట్లు పేర్కొంది.
