కాశ్మీర్ లో అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు కేంద్రం ఆమోదం
కాలం గుడుస్తున్న కొద్దీ జమ్మూ కాశ్మీర్లో జనజీవనం మెరుగుపడుతోంది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కాశ్మీరీలకు వారి జీవితాలపై సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది. అందులో భాగంగా తూటాలతో దద్దరిల్లే హిమగిరిలో క్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ భారీ స్టేడియంను నిర్మించేందుకు నడుం బిగించింది.
ఉగ్రవాదుల దాడులు.. సైనికుల పహారా.. ప్రతి రోజూ ప్రాణం కోసం పోరాటం.. ఇన్నాళ్లూ కాశ్మీర్ అంటే ఇవే మన కళ్లముందు మెదులుతాయి. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి మారుతోంది. ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా అక్కడి యువత అభ్యున్నతి కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా అయిన హీరానగర్‌లోని కథువా ప్రాంతంలోని దివంగన నేత ఆరుణ్ జైట్లీ పేరు మీద ఓ అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సోమవారం స్టేడియం పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
కాశ్మీర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ స్టేడియం నిర్మించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతేడాది చివరిలో ప్రతిపాదించారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే కరోనా నేపథ్యంలో స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభించడం ఆలస్యమైంది. ఎట్టకేలకు సోమవారం స్టేడియం నిర్మాణ పనులను జితేంత్ర సింగ్ స్వయంగా ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్టేడియం కాశ్మీర్ ప్రాంతానికి గొప్ప వన్నె తెస్తుందని జితేంద్ర సింగ్ అన్నారు. స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు కానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోందని, అయితే అంతకన్నా ఎక్కవ అయ్యే అవకాశం ఉందని జితేంద్ర సింగ్ వివరించారు. ఈ స్టేడియం కాశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాదని, జాతీయ స్థాయి క్రీడలు కూడా ఇక్కడ జరుగుతాయని, అంతర్జాతీయ టోర్నీలు సైతం నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.
కాశ్మీర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మిస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంధకారంలో మగ్గిపోతున్న జమ్మూ కాశ్మీర్లో యువతకు ఈ స్టేడియం ఓ ఉజ్వల భవిష్యత్తునిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా చెడు మార్గాలకు ఆకర్షితులై నష్టపోతున్న యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా సచిన్ టెండూల్కర్, ధోనీ వంటి క్రికెటర్లు, హీనాదాస్ వంటి రన్నర్లు, మరెందరో క్రీడాకారులు తయారవుతారని సంబరపడుతున్నారు.
