నాబార్డ్ తోడ్పాటుతో ఏపీలో కిసాన్ మిత్ర సేవలకు సీఎస్ఎ శ్రీకారం
SATYASHILA TV :
సాధారణంగా వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించి నెలకు, వారానికి ఒకసారి రైతులను ఉద్దేశించి ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వారా వ్యవసాయ సూచనలను అందిస్తుండటం పరిపాటి. అయితే, వీటిని రైతులు తమ గ్రామంలో నెలకొన్న వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని అమలు చేసుకోవలసి ఉంటుంది. ఇది రైతులందరికీ సాధ్యం కాకపోవచ్చు.
అయితే, గ్రామ స్థాయిలోనే పంటలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను నిరంతరం అధ్యయనం చేస్తూ.. ఆ గ్రామంలోని రైతులు పండిస్తున్న వివిధ పంటలకు తగిన విధంగా అన్వయించి.. ప్రతి మూడు రోజులకోసారి వ్యవసాయ సూచనలను వారి సొంత భాషలో మొబైల్స్ ద్వారా అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయా? సకాలంలో సరైన సూచనలు అందిస్తే పంట దిగుబడులు పెరగటంతోపాటు మంచి ధరను సైతం పొందగలుగుతారా?
గ్రామస్థాయిలో ఇలా అందించే సమగ్ర వ్యవసాయ సూచనలు కచ్చితంగా రైతులకు ఉపకరిస్తాయని స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) ఆశిస్తోంది. గత 15 ఏళ్లుగా తెలుగునాట సేంద్రియ/ప్రకృతి/ఎన్పిఎం వ్యవసాయ పద్ధతులను ఈ సంస్థ ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తోడ్పాటుతో సేంద్రియ / ప్రకృతి / ఎన్పిఎం పద్ధతుల్లో వివిధ పంటలు పండించే రైతులకు గ్రామస్థాయిలో వ్యవసాయ సూచనలు అందించే పైలట్ ప్రాజెక్టుకు సిఎస్ఎ ఇటీవల శ్రీకారం చుట్టింది.
