సిర్పూర్ పేపర్ మిల్లు ప్లాంట్ను మూడు నెలలపాటు బంద్
కోవిడ్-19 లాక్డౌన్ వల్ల తలెత్తిన ఆర్థిక నష్టాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా సిర్పూర్ పేపర్ మిల్లు ప్లాంట్ను మూడు నెలలపాటు బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అయింది. కాగిత పరిశ్రమపై కూడా ఈ ప్రభావం పడిందన్నారు. ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో తాము పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ బంద్ చేస్తున్నందుకు తాము బాధపడుతున్నట్లు తెలిపారు.
ఏదేమైనా ప్లాంట్లో కొత్త బాయిలర్ ఏర్పాటు, డిస్పాచ్తో పాటు ఇతర కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని వాటాదారులందరూ మూడు నెలలపాటు వేతనాలను త్యాగం చేయాలన్నారు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తమ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోనున్నట్లు తెలిపారు. ప్లాంట్ను వీలైనంత తొందరగా తెరిచేందుకే తమ ప్రయత్నాలు ఉంటాయని సూరి పేర్కొన్నారు.
